కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నది. అయినా అత్యవసరం, నిత్యావసరం అయిన కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు పనిచేస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలకు వచ్చే ఉద్యోగులు, సందర్శకులు, వినియోగదారులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి వస్తున్నది. ఒక్కొక్కరికి స్క్రీనింగ్ చేయడంవల్ల ఆయా సంస్థల సెక్యూరిటీ సిబ్బందికి పనిభారం పెరుగడమేగాక, ఉద్యోగులు, వినియోగదారులకు సమయం వృథా అవుతున్నది.
ఇప్పుడే ఇలా ఉంటే లాక్‌డౌన్ తర్వాత షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు తెరచుకుంటాయి. అప్పుడు పెద్ద సంఖ్యలో వచ్చే జనాలకు ఒక్కొక్కరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయడం తలకు మించిన భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ గువాహటి పరిశోధకులు ఏక కాలంలో ఎక్కువ మందికి కరోనా థర్మల్ స్క్రీనింగ్ చేసేలా ఒక డ్రోన్‌ను తయారు చేశారు. దీనిలోని అల్ట్రా వయొలెట్ కెమెరా ఒకేసారి ఎక్కువ మందికి థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాదు దీనిలో ఒక లౌడ్ స్పీకర్ కూడా ఉంటుంది. కరోనా ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.