కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్ధలు కొట్టింది : హరీష్‌ రావు

రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఉన్న భ్రమలను ఈ బడ్జెట్‌ బద్ధలు కొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయి. కానీ సంక్షేమ రంగానికే అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వద్దుల పార్టీగా మారింది. అందుకే దాన్ని ప్రజలు రద్దు చేశారు. బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలకు మాత్రం నిరాశ మిగిల్చింది అని మంత్రి పేర్కొన్నారు. మాంద్యం ఉన్నా సంక్షేమానికి రూపాయి కూడా తగ్గించొద్దని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకే మానవీయ కోణంలో బడ్జెట్‌ను రూపొందించామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఒక్క కొత్త విషయం కూడా చెప్పలేదు. సంక్షేమ రంగానికి నిధులు ఎక్కువ కేటాయించినందుకు వారు సంతోష పడలేదు.. కానీ ప్రభుత్వాన్ని విమర్శించారు అని మంత్రి ధ్వజమెత్తారు. ప్రజలందరినీ సంతోషపెట్టే విధంగా బడ్జెట్‌ ఉందన్నారు హరీష్‌రావు.