నేటినుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

తెలంగాణకు తలమానికమై ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. మార్చి 7 వరకు నిర్వహించనున్న ఉత్సవాల కోసం సర్వంసిద్ధమయ్యాయి. బుధవారం ఉదయం 11గంటలకు స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నందున బాలాలయంలోనే శ్రీవారి ఉత్సవ కైంకర్యాలు నిర్వహించనున్నారు. వేలమంది భక్తులు తిలకించేలా కొండకింద జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో కల్యాణోత్సవం నిర్వహించేందుకు భారీఎత్తున ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తం 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టాలు మార్చి 3న జరిగే ఎదుర్కోలు మహోత్సవంతో ప్రారంభంకానున్నాయి.