పూనమ్‌ పంజా..

లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/20) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు నిర్వహించిన వామప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో జరగాల్సిన తొలి పోరు వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో మనవాళ్లు ఆకట్టుకున్నారు. తొలుత తక్కువ పరుగులే చేసిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. చక్కటి బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసింది. శిఖ పాండే (24) టాప్‌ స్కోరర్‌. ఓ మోస్తారు లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుందనుకున్న విండీస్‌ జట్టు ఒత్తిడికి లోనై.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులకే పరిమితమైంది. శుక్రవారం మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.